Disclaimer: Media people are requested to cross check about the genuinity of the press note before publishing the same. PatrikaPrakatana.com does not hold any responsibility for any discrepancies (Refer FAQ page)

రచయితలలో నేను రాబందుని - మల్లాది వెంకట కృష్ణమూర్తి

Published At: October 15, 2023, 12:00 AM

ఆంధ్రుల ఆహ్లాద రచయితగా ప్రసిద్ధి పొందిన శ్రీ మల్లాది తన కొత్త పుస్తకం ' మిస్సింగ్  ' ముందు మాట/తన మాటలో ఈ విషయం వెల్లడించారు.కింది పోస్టు ఆయన మాటల్లోనే:


      తెలుగు సాహితీ జగత్తులో బోలెడు బృందాలున్నాయి. స్త్రీవాద బృందాలు, కమ్యూనిస్ట్ భావజాల బృందాలు, దళితవాద బృందాలు, మాండలీక బృందాలు, కులాల బృందాలు-ఇంకా ఎన్నెన్నో. స్త్రీవాద బృందం పలుకులు ఓ రీతిలో, మాండలీక బృందం వారి పలుకులు మరో రీతిలో ఇలా ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులనే పలుకుతూంటుంది. ఈ మధ్య అలాంటి ఓ గుంపులోంచి వచ్చిన తూటాలాంటి ఓ మాటని వాట్సప్ లో చదివాను. రచయితగా నన్నుద్దేశించి ఓ రచయితలబృందం 'రాబందు' అన్నారు. కారణం కమర్షియల్ రైటర్ని అవడంట! దాన్ని పొగడ్తగా తీసుకున్నాను.

     రాబందుకుండే లక్షణాలన్నీ రచయితగా నాలో ఉన్నాయి. నేను చిలుకలకన్నా, పిచ్చుకలకన్నా ఎక్కువ ఎత్తుకి ఎగురుతాను. నిజానికి మరే పక్షి నాఅంత ఎత్తుకి ఇంతదాకా ఎగరలేదు. ఎదగలేదు. అంటే, మరే పక్షీ నాలా వివిధ అంశాలమీద, నా అంత విరివిగా ఫిక్షన్, నాన్ ఫిక్షన్ రాయలేదు. వారు నన్నెప్పుడూ తలెత్తే చూడాలి. కారణం చిలుక పలుకగలుగుతుందే తప్ప పైకి ఎగరలేదు. ఆ చిలుక నా విషయంలో అదే పని చేసింది.
     రాబందు ఇతర పక్షులకి రారాజు. మౌనంగా ఆకాశాన్ని చుంబిస్తుంది. తక్కువ మాట్లాడుతుంది. అందుకే 53 ఏళ్ళనించి ఏ బృందంతో సంబంధం లేకుండా ఎంతో ఎత్తులో కూర్చుని నా రచనా వ్యాసంగాన్ని నేను చూసుకుంటూ వస్తున్నాను. సభల్లో, సన్మానాల్లో, సమావేశాల్లో, బుక్ ఫెయిర్లలో, వర్క్ షాపుల్లో, సెల్ఫీలు, గ్రూప్ ఫోటోల్లో, ఫేస్బుక్, శుభాకాంక్షలు, అభినందనల పోస్టులలో పోటెత్తను. ఏ రచయితనీ కలవను. రాబందు ఒంటరిగా ఎగురుతుంది. చిలుక, పిచ్చుకలు తమ వాటితో తప్ప రాబందుతో కలిసి ఎత్తుకి ఎగరలేవు. అందుకే చిన్నపక్షులతో కలిసి రాబందు ఎగరదు.


     రాబందు చూపు అద్భుతం. అత్యంత దూరంనించి అది తన ఆహారాన్ని చూడగలదు. ఐదు కిలోమీటర్ల దూరంనించి! ఓసారి తన ఆహారాన్ని చూసాక ఎంత కష్టమైనా సరే, రాబందు దాన్ని సాధిస్తుంది. నేను కూడా ఓ చిన్న ఆలోచన వస్తే ఎంతకాలమైనా దానిమీద వర్క్ చేసి ఓ జయం, ఓ అందమైన జీవితం, ఓ విలన్, ఓ నత్తలొస్తున్నాయి జాగ్రత్త, ఓ మిస్రాణి లాంటి నవలలని, కర్మ-జన్మ, ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్, సిల్వర్ స్క్రీన్, పిల్లల పేర్ల పుస్తకం, దేవుడికే తెలియాలి, సిల్వర్ స్క్రీన్ లాంటి నాన్ ఫిక్షన్ పుస్తకాలని రాసాను. తెలుగులో మీకోసం వివిధ ఫిక్షన్, నాన్-ఫిక్షన్ల కి చెందిన పుస్తకాలని నేను రాసినంత విస్తారంగా ఎవరూ రాయలేదు. రచయితగా నాతో సమానం కాలేదు.

     రాబందు ఎన్నడూ మరణించినవి తినదు. అది చిన్న జంతువులని వేటాడి తింటుంది. పాముని ఎత్తునించి బండరాయి మీదకి పడేసి చంపి తింటుంది తప్ప గద్దలా మరణించినవి తినదు. అలాగే నేను ఇతరులు రాసినవి కాపీ కొట్టి రాయను. వారారచన చేసాక ఆ ఆలోచన మరణించింది. నేను కొత్త ఆలోచనలతో కొత్తవి రాస్తూంటాను. పిల్లల పేర్ల పుస్తకం, కథలెలా రాయాలి?, మిసెస్ పరాంకుశం, రేపటి కొడుకు, మిస్సింగ్ లాంటివి తాజా ఆలోచనలనించి జనించినవే. మరణించిన కమ్యూనిజాన్ని పట్టుకుని వేలాడే బృందాలని చూసి జాలి పడుతూంటాను. తాజా వాటిమీద ఫోకస్ చేస్తాను. ఈ కారణంగానే ప్రచురణకర్తలు కోరినా నేను వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాయలేదు. ఆ విషయంమీద ఇంగ్లీష్ లో వెలువడ్డ పుస్తక రచయితలంతా సైకాలజీ చదువుకున్నవారు. స్వానుభవంతో స్వంతంగా రాసారు. నేనవి కాను. వారు రాసినవి కాపీ కొట్టడం నాకు ఇష్టం లేదు. చెప్పాగా, రాబందు మరణించినవి తినదు.

     రాబందుకి తుఫానులంటే భయం లేదు. మేఘాలు అలుముకోగానే మిగిలిన చిన్నపక్షుల్లా రాబందు గూట్లో తలదాచుకోదు. ఆ తుఫాను మేఘాలని అధిగమించి వాటి ఉపరితలానికి ఎగురుతుంది. ఇలాగే నేను రచయితగా ఛాలెంజ్ని ఇష్టపడతాను. ఉదాహరణకి గమ్యం ఒకటే, దారులు ఎన్నో అనే ఆధ్యాత్మిక పుస్తకానికి ఆలోచన రాగానే 'అమ్మో' అనుకోలేదు. సమస్యల్లోనే అవకాశం ఉంటుందని నాకు తెలుసు. వివిధ మతగ్రంథాలని సేకరించి, చదివి, అధ్యయనం చేసి, నోట్స్ రాసుకుని, వాటిని అధ్యాయాలుగా విభజించి 'అన్ని మతబోధనలు ఒకటే' అని నిరూపించే ఆ పుస్తకం రాసాను. దానికోసం వరసగా ఏడు నెలలు కష్టపడ్డాను. ఇలాగే కర్మ-జన్మ పుస్తకం రాయడానికి నేను పడ్డకష్టం ఏడు సంవత్సరాలు. హిందూ మతగ్రంథాలని ఔపోసన పట్టి దాన్ని రాసాను. అంతటితో తృప్తి పడలేదు. 14 సంవత్సరాల తర్వాత, ఈ వ్యవధిలో కర్మ గురించి సేకరించినవి కలిపి రివైజ్డ్ ఎడిషన్ని తయారుచేసి ఈ పుస్తకంతోపాటు 2023లో కర్మ-జన్మ వెలువరిస్తున్నాను. (వెల రూ.100) రచయిత దేన్నీ గాల్లోంచి సృష్టించలేడు. కాపీరైట్ లేని కొటేషన్స్, జోక్స్, చారిత్రాత్మక విషయాలు మొదలైనవి నా రచనల్లో సరైన ప్రదేశాల్లో వాడుకుంటాను. ఇది రచయిత నైపుణ్యంమీద ఆధారపడుతుంది. ఇందుకు విస్తారంగా చదవాలి. ఇదే మిగిలిన రచయితల రచనలకి, నా రచనలకి పాఠకులు స్పష్టంగా గమనించే తేడా.

     పాఠకులు ఆడ రాబందుల్లాంటివాళ్ళు. ఆడ రాబందుతో మగ రాబందు తేలిగ్గా జత కట్టలేదు. ఆడ రాబందు చాలా ఎత్తుకి ఎగిరి నోట్లోని పుడకని కిందికి జారవిడుస్తుంది. అది నేలమీద పడకుండా వేగంగా కిందికి ఎగురుతూ మగ రాబందు దాన్ని అందుకుని తన శక్తిని నిరూపించుకుంటేనే ఆడ రాబందు దాన్ని తన జతగా అంగీకరిస్తుంది. పాఠకులు కూడా తమని తృప్తిపరిచే రచనలనే ఇష్టపడతారు. తెలివిగల పాఠకుడు తెలివిగల రచనలని, మూర్ఖపాఠకుడు మూర్ఖరచనలని ఇష్టపడతారు. పాఠకులకి ఏం నచ్చుతాయో తెలిసి అన్ని రకాల పాఠకుల ఆదరణని అందుకుంటూ, వారిని పోగొట్టుకోకుండా 53 ఏళ్ళుగా. రచయితగా కొనసాగడం ఓ రాబందుకే, ఒక్క మల్లాది వెంకట కృష్ణమూర్తికే సాధ్యం.

     ఈ కారణంగానే పాఠకులు 1980లలో స్వాతి వీక్లీ నిర్వహించిన పోటీలో నా పేరుని 'సూపర్ రైటర్'గా ఎన్నుకున్నారు. ఆంధ్రుల ఆహ్లాద రచయిత అని పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు మెచ్చుకున్నారు. సంపాదకులని, ప్రభుత్వాలు నియమించిన వ్యక్తులని ప్రాంతీయభావంతో, సన్మానాలతో ప్రభావితం చేసి టైటిల్స్, అవార్డలని పొందడం కాదు. పాఠకులని మెప్పించి వాటిని పొందినవాడే సరైన రచయిత. కాబట్టి ఏతావాతా వారు నన్ను రాబందు అనడాన్ని అంగీకరించానని ఆ బృందానికి తెలియచేస్తున్నాను.

     రాబందు పునరుజ్జీవనాన్ని ఇష్టపడుతుంది. 40వ ఏడు వచ్చాక అది జీవించాలా, మరణించాలా అనే నిర్ణయం తీసుకోవాలి. మరో 30 సంవత్సరాలు జీవించడానికి రాబందు 5 నెలలపాటు కష్టపడి తన గోళ్ళని, ముక్కుని తొలగించుకుంటుంది. వాటి స్థానంలో కొత్తవి మొలిస్తే మరో 30 ఏళ్ళు జీవిస్తుంది. కష్టం లేకపోతే సుఖం లేదు. 'నా రచనలని ఎలా మెరుగు పరుచుకోవచ్చు? పాఠకులకి ఏం నచ్చుతుంది? చదివినవాళ్ళు ఏమంటున్నారు?' అని తమ గూట్లోంచి బయటకి రాని చిలుకలు ఎన్నడూ ఆలోచించవు. అందుకే చిలుకలు రాబందులుగా మారలేవు.

     బై ది వే, ఇప్పుడిదంతా ఎందుకు? అహంకారమా? కాదు. ఓ జవాబు మాత్రమే. నేను జీవించి ఉండగా నా గురించి నేనే చెప్పుకోవాలి. ఇప్పుడు కాని, ఆ తర్వాత కాని ఇక ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎటూ ఉండరు. దాంతో భవిష్యత్ తరాలవారికి తెలీకపోవచ్చు. అందుకని ఇదంతా చెప్పాను. బృందాలుగా చీలిపోయిన చిలకలకి సాహిత్య రాబందు
గురించి తెలీదని బోధించాలని కూడా అనిపించడం మరో కారణం. కాబోయే రచయితలకి నా సలహా.

    ఎప్పుడూ చిలుకో, పిచ్చుకో అవకండి, ఇజాల జోలికి పోకండి.
    చిలుకగా మారకుండా రాబందుగా రయ్యిన పైకి దూసుకెళ్ళండి.
    మీరు మీ రంగంలో ఏదైనా అవాలనుకుంటే రాబందవండి.

      ఒక విజ్ఞప్తి: జులై 2022లో తొమ్మిది గంటలు తర్వాత, అంటే సరిగ్గా ఏడాదిగా నా పుస్తకం ప్రచురించబడలేదు. నా కొత్త పుస్తకం ఎప్పుడు వస్తుందంటూ నాకు తరచు పాఠకులనించి వాట్సప్ మెసేజ్ లు వస్తూంటాయి. మారిన వ్యాపారధోరణివల్ల, తగ్గిన పాఠకాదరణవల్ల పుస్తక ప్రచురణ సాధ్యం కావడంలేదని జవాబు ఇస్తూంటాను. నా పుస్తకం కొని చదివే పాఠకులు ఎందరున్నారో నాకు తెలీదు కాని, వారికి నా దగ్గరో ప్రతిపాదన ఉంది. పుస్తకాల షాపులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నా రచనని తప్పక కొనే కనీసం 500 మంది పాఠకులు లభ్యమైతే నెలకో పుస్తకం వెలువరించగలను. ఇప్పటికే 12 పాత, కొత్త పుస్తకాలు ప్రింటింగ్ కి సిద్ధంగా ఉన్నాయి.

     మీరీ స్కీమ్ లో సభ్యులు అవదలచుకుంటే, ఆ సంగతి నాకు వాట్సప్ ద్వారా (98490 22344) మెసేజ్ పంపండి. పుస్తకం ధర (మధ్యవర్తుల కమిషన్ ఉండదు కాబట్టి ప్రతీ పుస్తకం ధర 40% తగ్గుతుంది) ముందుగా చెల్లించే 500 మంది పాఠకులు ఈ స్కీమ్ చేరగానే నా పుస్తకాల ప్రచురణని తక్షణం కొనసాగించగలను. అది కరువైతే 135 ఏళ్ళుగా వెలువడే నేషనల్ జియోగ్రాఫిక్ మేగజైస్ 2024లో కనుమరుగవుతున్నట్లుగా, క్రమంగా నా పుస్తకాలు కూడా కనుమరుగవచ్చు. నేను కనుమరుగయ్యాక ఇక లభ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా చాలా అముద్రితాలు. ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టి పదిమందికి అందేలా చేయప్రార్ధన.
          మల్లాది వెంకట కృష్ణమూర్తి

  • Website: N/A
  • Facebook: N/A
  • Twitter: N/A
  • LinkedIn: N/A
  • Instagram: N/A
Disclaimer: Media people are requested to cross check about the genuinity of the press note before publishing the same. PatrikaPrakatana.com does not hold any responsibility for any discrepancies (Refer FAQ page)